పండ్లు నేరుగా తింటే వాటిలోని ఫైబర్‌ రక్తంలో చక్కెర పెరుగుదలను నెమ్మదిస్తుంది. కానీ జ్యూస్‌గా తీస్తే ఫైబర్‌ తగ్గి చక్కెర వేగంగా రక్తంలో కలుస్తుంది, ఇన్సులిన్‌ అకస్మాత్తుగా పెరుగుతుంది. తరచుగా జ్యూస్‌ తాగితే ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌, టైప్-2 డయాబెటిస్‌ ప్రమాదం పెరుగుతుంది. మార్కెట్‌ ప్యాక్డ్‌ జ్యూస్‌లలో అదనపు చక్కెరలు, రసాయనాలు ఉంటాయి కాబట్టి హానికరం. కాబట్టి పండ్లనే తినడం మంచిది. జ్యూస్‌ తాగాలంటే ఇంట్లో చక్కెర లేకుండా, వడకట్టకుండా, తక్కువ పరిమాణంలో భోజనం తర్వాత మాత్రమే తాగాలి.

పండ్లలో పీచు పదార్థం (ఫైబర్‌) ఎక్కువగా ఉంటుంది. ఆ పండును నేరుగా తిన్నప్పుడు.. రక్తంలో చక్కెర కలిసే వేగాన్ని ఫైబర్‌ తగ్గిస్తుంది. కానీ, పండ్ల నుంచి రసాన్ని తీసినప్పుడు.. అందులోని పీచు పదార్థం మొత్తం పోతుంది. దాంతో పండ్ల రసాల్లోని చక్కెర.. రక్తంలో చాలా త్వరగా కలిసిపోతుంది. ఇన్సులిన్‌ స్థాయులను అకస్మాత్తుగా పెంచుతుంది. ఇక అనేక రకాల పండ్ల రసాల ైగ్లెసెమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇవి రక్తంలోని చక్కెర స్థాయులను వేగంగా పెంచుతాయి. వీటిని తరచుగా తీసుకుంటే.. శరీరంలో ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఏర్పడి, భవిష్యత్తులో టైప్‌-2 మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణ పండ్ల రసాలతో పోలిస్తే.. మార్కెట్లలో దొరికే ప్యాక్డ్‌ జ్యూస్‌లు మరింత ప్రమాదకరం.

ఎందుకంటే.. తీపి కోసం వీటిలో అదనపు చక్కెరలు, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి రసాయనాలు కలుపుతారు. కాబట్టి, వీటిని తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదు. బరువు పెరగడంతోపాటు మధుమేహం వచ్చే ముప్పు కూడా ఉంటుంది. కాబట్టి, జ్యూస్‌కు బదులుగా పండ్లనే నేరుగా తినడం మంచిది. పండ్ల రసానికి బదులుగా.. పండ్లు పూర్తిగా తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం 7 శాతం తగ్గుతుందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. ఒకవేళ జ్యూస్‌ తాగాలనుకుంటే.. ఇంట్లోనే చేసుకోవాలి. అందులో చక్కెర లేకుండా, జ్యూస్‌ను వడకట్టకుండా.. పీచుతో సహా తాగాలి. అదికూడా తక్కువ పరిమాణంలో.. ఒక్కో సర్వింగ్‌కు సుమారు 100-150 ఎంఎల్‌ ఉంటే సరిపోతుంది. అంతేకాదు.. ఖాళీ కడుపుతో పండ్ల రసం తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదు. భోజనం తర్వాత జ్యూస్‌ను తాగితే.. చక్కెర శోషణ నెమ్మదిస్తుంది.