ములుగు జిల్లాలోని అనుమతి లేని జలపాతాలు మరోసారి ప్రాణాలను బలిగొన్నాయి. వాజేడు మండలం దూలాపురం శివారులోని మాసాలోద్ది జలపాతంలో సిద్దిపేట జిల్లాకు చెందిన బీటెక్ తొలి సంవత్సరం విద్యార్థి యాద వైభవ్ కుమార్ (18) ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు.
స్నేహితులతో కలిసి జలపాతాన్ని సందర్శించిన వైభవ్ కుమార్ కాలుజారి నీటిలో పడిపోవడంతో అక్కడున్న యువకులు వెంటనే బయటకు తీసి సీపీఆర్ చేశారు. అనంతరం వాజేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం ఏటూరునాగారం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే అతడు కన్నుమూశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వర్షాకాలంలో అనుమతి లేని జలపాతాల వద్దకు వెళ్లవద్దని పోలీసులు, అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తుండగా, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.