తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం అధికారులతో సమీక్షలు, రాజకీయ సమావేశాలు, ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. పదునైన వ్యాఖ్యలు, చురుకైన నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఆయన.. ఈసారి మాత్రం పూర్తిగా భిన్నమైన కోణంలో కనిపించారు. తన మనవడు రేయాన్ష్ కోసం స్వయంగా వంటగదిలోకి వెళ్లి పూరీలు చేసి పెట్టిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మనవడి కోసం గంటె పట్టిన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పూరీలు ఒత్తి, నూనెలో వేయించారు. పక్కనే ఉన్న రేయాన్ష్‌తో సరదాగా మాట్లాడుతూ పూరీలు వండిపెట్టారు. ఈ సందర్భంగా "ఈ పూరీలు ఎవరికి?" అని రేవంత్ రెడ్డి అడగగా, "అమ్మమ్మకో" అంటూ మనవడు చెప్పిన సమాధానం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది.
బిజీ రాజకీయ జీవితంలోనూ కుటుంబానికి సమయం కేటాయిస్తూ మనవడితో గడిపిన ఈ మధుర క్షణాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వస్తుండగా, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ అనుబంధాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.