రేవంత్ రెడ్డి సొంత సర్వేలోనూ ప్రజా వ్యతిరేకత స్పష్టమైందని వ్యాఖ్య

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాభిమానం కోల్పోయిందని, ఆ పార్టీ పతనం దాదాపు ఖాయమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు చెందిన పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సగం పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించుకున్న అంతర్గత సర్వేలోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తేలిందని కేటీఆర్ పేర్కొన్నారు. పరిపాలన, నాయకత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన అన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితి సుమారు 78 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి సొంత సర్వేలోనే వెల్లడైందని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా, రెండు ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ విభాగాలు సేకరించిన ప్రజాభిప్రాయంలో కూడా ఇదే విషయం వెల్లడైందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని ఆయా సర్వేలు సూచించాయని ఆయన వ్యాఖ్యానించారు.