కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను సందర్శించారు. ఆస్పత్రిలోని పలు వైద్య విభాగాలను పరిశీలించిన అనంతరం పాలక మండలితో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీబీనగర్ ఎయిమ్స్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో దక్షిణాదిలోనే అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ పనులు 87 శాతం పూర్తయ్యాయని, ఈ ఏడాది చివరికల్లా పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.
రోగుల సంఖ్య పెరిగినా వైద్యుల నియామకంలో లేదా సేవల నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసిన నడ్డా, వైద్య సేవలతో పాటు వైద్య విద్య, పరిశోధనలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం రోజుకు సుమారు 1,800 మంది అవుట్‌పేషెంట్లకు సేవలు అందుతున్నాయని, టెలీమెడిసిన్, ఓపీడీ ద్వారా ఇప్పటివరకు 1.56 లక్షల మందికి వైద్య సేవలు అందించినట్లు తెలిపారు.
ఎయిమ్స్‌లో 132 మంది ఫ్యాకల్టీ సభ్యులు, 133 మంది సీనియర్ వైద్యులు పనిచేస్తున్నారని, వైద్య పరిశోధనల కోసం రూ.64 కోట్ల గ్రాంట్లు మంజూరయ్యాయని చెప్పారు. ప్రస్తుతం 129 పరిశోధన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, 156 పరిశోధన పత్రాలను ఫ్యాకల్టీ సభ్యులు సమర్పించినట్లు వెల్లడించారు. అలాగే 2014కు ముందు దేశంలో కేవలం ఏడు ఎయిమ్స్‌లు మాత్రమే ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో వాటి సంఖ్య 23కు పెరిగిందని నడ్డా పేర్కొన్నారు.